ప్రముఖ యాపిల్ టెక్ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనున్నారు. ఈ క్రమంలోనే ఈ బాధ్యతలను యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబిహ్ కాన్కు అప్పగించనున్నారు. జులై చివర్లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక డిజైనింగ్ టీమ్ బాధ్యతలను నేరుగా టీమ్‌కుక్ స్వీకరించనున్నారు. భారతీయ మూలాలున్న సబిహ్ ఖాన్‌కు యాపిల్ సంస్థలో 30 ఏళ్ల అనుభవం ఉంది. గత ఆరేళ్ల నుంచి ఆయన యాపిల్ గ్లోబెల్ సప్లై ఛైన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే సబిహ్ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో జన్మించారు. అక్కడ అయిదవ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత ఖాన్ కుటుంబం సింగపుర్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడ ఆయన పాఠశాల విద్యాభ్యాసం ముగిశాక.. వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఆయన బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పట్టా కూడా అందుకున్నారు. 1995లో ఆయన యాపిల్ ప్రొక్యూర్మెంట్ గ్రూప్‌లో కూడా పనిచేశారు. అంతకుముందు జీఈ ప్లాస్టిక్స్‌లో డెవలప్మెంట్ ఇంజినీర్, అకౌంట్ టెక్నికల్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) బాధ్యతలు అందుకోనున్నారు.
