బంగ్లాదేశ్ లో గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిరసనకారులను కట్టడి చేసేందుకు దేశ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పోలీసులకు జారీ చేసిన ఆడియో ఒకటి తాజాగా లీక్ అయింది. బీబీసీ వార్తా సంస్థకు చెందిన పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. లీకైన ఆడియా ప్రకారం.. ఒక సీనియర్ పోలీసు అధికారికి హసీనా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిరసనకారులను కట్టడి చేయడానికి ప్రాణాంతకమైన ఆయుధాలను వినియోగించాలని ఆమె సూచించారు. అంతేకాక, వారు ఎక్కడ కనిపించినా కాల్చేయాలని ఆదేశించారు. గతేడాది జులై 18న ఢాకాలోని తన అధికార నివాసం గణభబన్ నుంచి ఆమె ఈ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత నిరసనలను కట్టడి చేసేందుకు పోలీసు అధికారులు పలు ఆయుధాలు ఉపయోగించినట్లు బీబీసీ పత్రాలు వెల్లడిస్తున్నాయి. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1,400 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ నిరసనల నేపథ్యంలోనే హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె.. స్వదేశాన్ని వీడి భారత్ కు వచ్చి రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. మహమ్మద్ యూనస్ బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి హసీనాను స్వదేశానికి రప్పించాలని ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. ఆమెపై స్వదేశంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష వేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ తీర్పు వెలువరించింది.
