హైద్రాబాద్‌లో కల్తీ కల్లు.. 15 మందికి అస్వస్థత

Published on 

TS: హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కొందరు పరిస్థితి అర్థరాత్రి విషమించింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కూకట్‌పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇంద్రహిల్స్, కె.పి.హెచ్.బి ఉషాముళ్ళపూడి రోడ్డులోని కల్లు కాంపౌండ్ లలో శనివారం కల్లు తాగిన సుమారు 15 మంది విరోచనాలు, వాంతులతో ఆసుపత్రిలో చేరటం జరిగింది. సమాచారం అందుకున్న పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ, బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని 108 అంబులెన్స్ లలో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు తమ బాధిత కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులు వారితో మాట్లాడి ఒప్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ లభిస్తున్న దానికన్నా మెరుగైన చికిత్స అందేలా చూసే బాధ్యత తమదని హామీ ఇవ్వటంతో వారు బాధితులను నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు అంగీకరించారు.

అస్వస్థతకు గురైన వారిలో పెంటేష్, మాధవి, యాదగిరి,మోనప్ప, పోచమ్మ, కోటేశ్వర రావు, రాములు, దేవదాసు, లక్ష్మీ, గోవిందమ్మ, నరసింహ, యోబు, సత్యనారాయణలు ఉన్నారు. కాగా సత్యనారాయణ కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో, ప్రస్తుతం అతడికి రాందేవ్ రావు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వీరిలో మోనప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో, అతడిని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, కల్తీ కల్లు తాగిన మరో ముగ్గురు చికిత్స నిమిత్తం కూకట్‌పల్లి ప్రతిమ ఆస్పత్రిలో చేరగా, మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, మరొకరి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form