బీహార్ (Bihar)లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో నితీశ్ కుమార్ (Nitish Kumar) వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని (35 Percent reservation for women) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.
ఇక ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలకు సామాజిక పెన్షన్ను నితీశ్ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400గా ఉన్న పెన్షన్ను ఇప్పుడు రూ.1100 లకు పెంచారు. పెరిగిన పెన్షన్ జూలై నెల నుంచే అమలులోకి వచ్చింది. అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో జూలై 10న పెన్షన్ డబ్బులు పడుతాయని తాను హామీ ఇస్తున్నానని గత నెల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వేస్తూ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించారు.
