కేరళ (Kerala)లో ప్రమాదకర నిఫా వైరస్ (Nipah Virus) తిరిగి ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాధి సోకి ఒక టీనేజర్ ఈ నెల 1న కోజీకోడ్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానలో మరణించగా, మలప్పురానికి చెందిన 18 ఏండ్ల యువతి, పాలక్కాడ్‌కు చెందిన 39 ఏండ్ల మహిళకు ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వైరస్ బయపడిన కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. దాదాపు 400 మందికిపైగా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించింది. వైరస్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. కాంటాక్ట్ ట్రేసింగ్, రోగ లక్షణాల గుర్తింపుతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రాంతంలో 26 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఎలా వ్యాపిస్తుంది..
దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కోజికోడ్ జిల్లాలోనే బయటపడింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు, చికిత్స?
వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
