శ్రీనగర్ : భారతదేశం – పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో కాశ్మీర్‌లోని తమ దేశ పౌరులు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌తో పాటూ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ సూచన చేసింది. ఈ దాడుల్లో 31 మంది మరణించగా, 57 మంది గాయపడ్డారని పాకిస్తాన్ నివేదించిన విషయం తెలిసిందే.
భారత్ దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంట అత్యంత భారీ మోర్టార్ షెల్లింగ్‌లలో విరుచుకుపడుతుంది. ఈ ఘటనలో నలుగురు పిల్లలు, ఒక సైనికుడు సహా కనీసం 13 మంది మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన పౌరులు లడఖ్‌ను మినహాయించి జమ్మూ కాశ్మీర్‌కు ప్రయాణాన్నిమానుకోవాలని పునరుద్ఘాటించింది. 90ల నాటి ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు కాశ్మీర్‌లో ఐదుగురు ఇజ్రాయెల్ పర్యాటకులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒక ఇజ్రాయెల్ వ్యక్తి ని ఉగ్రవాదులు హతమార్చారు.
