బీజాపూర్, ఏప్రిల్ 30: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్ట కొండను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. తొమ్మిది రోజుల సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం భద్రతా దళాలు ఐదు వేల అడుగుల ఎత్తైన కర్రెగుట్టను అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. కర్రెగుట్టల స్వాధీనం అనంతరం సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం కొండపైన ఉన్న బహిరంగ మైదానంలో భద్రతా దళాల తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు, వందలాది మంది సైనికులు విడిదికి భద్రతాపరమైన ఏర్పాట్లన్నీ చేస్తునట్లు ఉన్నతాధికారులు వివరించారు. భద్రతా దళాలకు అవసరమైన సరుకులను హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
అయితే కర్రెగుట్టను అనుకోని వున్న మరో రెండు గుట్టలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకునే పనిలో సీఆర్పీఎఫ్ ఉన్నట్లు సమాచారం. కర్రెగుట్ట కొండ నక్సలైట్ ఉద్యమానికి ముఖ్యమైన స్థావరంగా ఉండటంతో ఇక్కడి నుండి చుట్టుపక్కల అటవీ ప్రాంతాలపై ప్రత్యక్ష నిఘా పెట్టడంతో పాటు నక్సల్స్ చర్యలను అరికట్టవచ్చు అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇక్కడే శాశ్వత భద్రతా పోస్టు (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్)ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొండల స్వాధీనంతో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో మరింత మరింత పురోగతి సాధినట్లు భావిస్తున్నారు.
కాగ, పీఎల్జీఏ బెటాలియన్ 1 కు చెందిన నక్సలైట్ హిడ్మా అతని అనుచరులు ప్రాణాలను కాపాడుకోవడానికి కొండలు, దట్టమైన అడవుల గుండా తెలంగాణకు వైపుకు సాగినట్లు ఆనుమానిస్తున్నారు. ఇది పూర్తిగా నిర్ధారించబడనప్పటికీ ఆపరేషన్ కగార్ ముగిస్తే వరకు బలగాలను అక్కడే మోహరించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌కు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర వైపు నుండి పూర్తిస్థాయి మద్దతు లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
