ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి తమను చర్చలకు పిలవాలని భాకాపా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మరోమారు కోరింది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని భాకాపా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖలో కోరారు.
2024 జనవరి నుంచి కేంద్ర, రాష్ట్ర పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను, అమాయక ఆదివాసులను హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక, విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేసి, కాల్పులు విరమించి ప్రభుత్వం, మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. తమ పార్టీ కేంద్రకమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశామని గుర్తుచేశారు. మా పీ.ఎల్.జీ.ఏ. బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని తమ కామ్రేడ్స్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. శాంతి చర్చల కోసం తమ పార్టీ వైపు నుంచి ఇచ్చిన ప్రకటన, దండకారణ్యంలోని ఉత్తర్-పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రేడ్ రూపేశ్ ఇచ్చిన రెండు ప్రకటనలతో కలిసి ఇప్పటికే మూడు పత్రికా ప్రకటనలు విడుదల అయ్యాయని తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో హత్యాకాండలో మా కేంద్రకమిటీ సభ్యుడు వివేక్ తదితర కామ్రేడ్స్‌ను హత్య చేశారని అన్నారు. మిగతా మావోయిస్టులు లొంగిపోకపోతే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు చేస్తున్నాయని అన్నారు. భారతదేశ రాజ్యాంగంలో రాసుకున్న మనిషికి జీవించే హక్కును కాలరాచి వేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామయ్యామని చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదుర్కొంటామని బహిరంగంగానే మాట్లాడుతున్నాయని తెలిపారు.
ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని దిగ్భందించి తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి 10 వేల మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలను మోహరించి 5 రోజుల నుంచి పెద్ద ఆపరేషన్ సాగిస్తూ మా కామ్రేడ్స్ ఆరుగురిని హత్య చేయడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వాపోయారు.
ఒకవైపు ప్రభుత్వం, మా పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా విప్లవకారులపై, ఆదివాసులపై హత్యాకాండలు సాగిస్తే శాంతి చర్చల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు ఏమాత్రం అర్థం లేకుండా పోతుందని అన్నారు. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ హత్యాకాండలను ఆపాల్సిందిగా, దేశవ్యాప్తంగా ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సిందిగా మా పార్టీ కేంద్రకమిటీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
శాంతి చర్చల కోసం, సమస్య పరిష్కారం కోసం తమ న్యాయమైన ఈ డిమాండ్‌కు మద్దతు ప్రకటించాలని.. శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలని.. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా యావత్తు ప్రజాస్వామికవాదులను, శాంతికాములను, పీడిత ప్రజలను, పీడిత సెక్షన్లను, పీడిత జాతులను కోరారు.
