TS: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఐకాస ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను బేేషరతుగా క్రమబద్ధీకరించాలన్నారు. కేంద్రంలో ఏమైనా అడ్డంకులు వస్తే పార్లమెంట్‌లో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించడంలో గత భారాస ప్రభుత్వం విఫలమైందన్నారు. మహాధర్నాలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, భాజపా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, సీపీఎం నాయకుడు డీజీ నరసింహారావు, సామాజిక వేత్త రవిచంద్ర, ఐకాస నాయకులు పాల్గొన్నారు.
