నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఈ రోజు తెల్లవారుజామున ఆరున్నర గంటలకు నేపాల్, భారత్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో ఈశాన్య లబుచేకు 93 కి.మీ దూరంలో.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా, భూకంపం.. చైనా, భూటాన్, బంగ్లాదేశ్ తోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలపైనా ప్రభావం చూపింది. తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్లో భూమి కంపించింది. బిహార్ రాజధాని పాట్నాతోపాటు మరికొన్ని జిల్లాలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.