TG: దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించనుంది. దీనికి సంబంధించి ఉపముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వివరాలు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది AE లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మిగులు విద్యుత్తు ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. అందులో భాగంగానే నూతన ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పారు. దీని వల్ల దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 4న జరిగిన క్యాబినెట్ సమావేశంలో న్యూ ఎనర్జీ పాలసీని ఆమోదించామని వివరించారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందన్నారు.