న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో ఉగ్రమూకల చేతిలో మరణించిన సైనికుల త్యాగం వృథా కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)తో పేల్చివేయడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ)కి చెందిన ఎనిమిది మంది జవాన్లు ఒక డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.
“బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్)లో జరిగిన IED పేలుడులో DRG సైనికులు మరణించారనే వార్త నాకు చాలా బాధ కలిగించింది. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం, కానీ మన సైనికుల త్యాగం వృథా కాదని నేను మీకు హామీ ఇస్తున్నానని” రాసుకొచ్చారు. మార్చి 2026 నాటికి భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్గాటించారు.