ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతా వాహనాన్ని పేల్చివేయడంతో 9 మంది జవాన్లు మృతి చెందారు. దాడి సమయంలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది స్కార్పియో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో బస్తర్ లోని కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ తెలిపారు. ఈ ఘటనలో స్కార్పియో ఎస్యూవీ వాహనం గాల్లోకి ఎగిరి పడిండి.
మృతి చెందిన భద్రతా సిబ్బంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు చెందిన వారుగా తెలుస్తొంది. రాష్ట్రంలో మావోయిజాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన బృందం ఇది. ఐఈడీ పేలుడు తీవ్రతకు ఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడింది.
గత రెండేళ్ల కాలంలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి తెలిపారు. ఏప్రిల్ 26, 2023 న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్‌ని పేల్చివేయడంతో పది మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్ మరణించారు.
మరోవైపు ఈరోజు తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు దాడి చేసి ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు మావోయిస్టులను హతమార్చాయి. ఏకే 47, సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్స్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.