- డేవిడ్
మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో షుమారు 700 తెగలకు చెందిన 9 కోట్ల మందికిపైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం అటవీ భూములే. మన రాష్ట్రంలో 30 తెగలకు చెందిన ఆదివాసులు, మరో ఐదు తెగలకు చెందిన మైదాన ప్రాంతవాసులు 60 లక్షల మందికి పైగా 9 జిల్లాలోని షెడ్యూలు ప్రాంతాల్లో నివశిస్తున్నారు.
రాజ్యాంగ పరంగా షెడ్యూలు 5,6 లలో ప్రత్యేక రక్షణలు కల్పించబడిన ఆదివాసుల జీవనం నేడు పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మైదాన ప్రాంత షావుకార్ల, వడ్లీవ్యాపారుల మోసాలకు. అన్యాయాలకు,దోపిడీ దౌర్జన్యాలకు ఫారెస్టు అధికారుల వేధింపులకు గురౌతూ ఆదివాసులు గలకాలంగా తమ మనుగడకోసం, మెరుగైన జీవనం కోసం పోరాతున్నారు. ఈనాడు ఆ సమస్యలన్నింటికీ తోడు వేలాది, లక్షలాది ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపన పేరిట, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట,గనుల తవ్వకం పేరిట బడా, బహుళజాతి, కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టటం ద్వారా ఆదివాసులను అడవి నుండే శాశ్వతంగా దూరం చేసేందుకు పాలకులు పూనుకున్నారు. ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న పాలకులు గత ఆరున్నర దశాబ్ధాలుగా చేపడుతున్న విధానాల ద్వారా గత రెండు దశాబ్దాలుగా ఆదివాసులకు కల్పించామన్న రక్షణలన్నీ ఒక్కోట్టిగా తొలగించివేస్తూ వస్తున్నారు.
ఆదివాసీ హక్కుల చట్టాలను నీరుగారుస్తున్న పాలకులు:
శ్రీకాకుళ గిరిజన రైతాంగ ఉద్యమానంతరం కాలంలో అటవీ ప్రాంతంలో ఆదివాసుల భూమిహక్కును నామమాత్రంగానైనా పరిరక్షించే 1/70 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ చట్టాన్ని క్రమంగా నీరుకారుస్తూ వచ్చిన పాలక ప్రభుత్వాలన్నీ, అటవీ భూములను గిరిజనేతర భూస్వాముల పరం చేయటంతో పాటు, పెద్దఎత్తున బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెడుతూ వచ్చాయి. ఆదివాసుల స్వయం పాలనలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996లో ‘పంచాయితీరాజ్ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టాని’ (పెసా) తెచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించటంలోనే ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయితీలకూ, మండల పరిషత్తులకూ కట్టబెడుతూ ఆదివాసుల హక్కులపై వేటు వేసింది. తద్వారా ఆదివాసుల అటవీ భూములను అన్యాక్రాంతం చేసే చర్యలను వేగవంతం చేసింది. పర్యావరణ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారమే లక్ష ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని ప్రభుత్వం నియమించిన గిర్గ్లానీ కమిటీ వెల్లడిరచేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఆదివాసుల భూముల దురాక్రమణను ప్రధానంగా ప్రస్తావించింది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేయటం ప్రారంభమైన తర్వాత అదివాసుల జీవనం ‘పెనం మీద నుండి పోయ్యిలో పడిన’ చందం అయ్యింది. విదేశీ, సామ్రాజ్యవాద బడా కంపెనీలు విచ్చలవిడిగా అడవులలోని భూగర్భ, ఉపరితల సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టుకెళ్ళేందుకు దోపిడి పాలకులు అన్నిరకాల అనుమతులూ ఇచ్చివేస్తున్నారు. నామమాత్రంగానైనా అదివాసుల హక్కుల రక్షణకోసం వున్నాయని చెప్పే చట్టాలన్నీ ఈ చర్యలతో పూర్తిగా తుడిచిపెట్టుకునిపోతున్నాయి. విద్యను అందని ద్రాక్షగా మార్చి కార్పోరేటీకరించిన పాలకులు మరో చేత్తో విద్యాహక్కు చట్టం చేసిన విధంగానేÑ వైద్యాన్ని ఖరీదైన అంగడిసరుకుగా మార్చిన పాలకులే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో భ్రమలు కల్పిస్తున్నట్లుగానేÑఆహార భద్రత చట్టాన్ని చేస్తున్న తీరులోనేఆదివాసుల హక్కులన్నింటినీ ఒకవైపున హరించివేస్తున్న పాలకులు, మరోవైపున ఆదివాసీహక్కుల చట్టం
2006 పేరిట మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు.
ఆదివాసులు అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లోనే, ఐటిడిఏ ద్వారానో అమ్ముకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూనూ సాప్రదాయక ఆదివాసుల జీవనం సాగిస్తూ వస్తున్నారు. తాము వ్యవసాయం చేస్తున్న ప్రాంతంలో భూసారం తగ్గాకా మరో ప్రాంతాన్నెంచుకొని అక్కడ వ్యవసాయం చేయటమనే పద్ధతిని ఆదివాసులు అనుసరిస్తూ వస్తున్నారు. అయితే వీరు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు చట్టబద్ధ పట్టాలను, వాటిపై మరొకరి ఆధిపత్యాన్ని అదివాసులు ఎరగరు. కాగా, పాలకులు తీసుకువచ్చిన ఆదివాసీ హక్కుల చట్టంఆదివాసులకు హక్కులు అదనంగా కల్పించకపోగా, సాంప్రదాయకంగా ఆదివాసులకు అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికీ 5 ఎకరాల నిర్దిష్ట, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడి వరకే కట్టడి చేయబూనుకోవటమన్నది
ఈచట్టంలో అంతర్లీనంగా దాగివున్న అసలు ఉద్దేశ్యం. తద్వారా పాలకులు, మిగిలిన అటవీ భూములన్నింటినీ యధేచ్ఛగా దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు చట్టపరంగా వెసులుబాటు పొందే ఆలోచన దీని వెనుక దాగివుంది.
ఆదివాసీ భూముల పరాయీకరణప్రజల ప్రతిఘటన: సమతా కేసులో సుప్రీంకోర్టు 1/70ని పునరుద్ఘాటిస్తూ ఏజన్నీ ప్రాంత భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని విస్పష్టంగా పేర్కొన్నది. పాలకులు ఈ తీర్పును నీరుగార్చుతూ వచ్చారు. ఏజన్నీ ప్రాంత భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో వినియోగిస్తున్నట్లుగా నాటకమాడి జిందాల్ వంటి వివిధ సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నారు. పాలకులు ఈ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా తీవ్రనిర్భందాన్ని అణచివేతలను ఎదుర్కొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒరిస్సా రాష్ట్రం
కళింగ నగర్లో తమ భూములను దురాక్రమించి నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగార స్థాపనను నిరసించిన ఆదివాసులపై ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మందిని బలిగొంది. ‘పోస్కో కొరకు ‘వేదాంత’ కోసం అటవీ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆదివాసులు సమైక్య పోరాటం సాగిస్తున్నారు. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏజన్సీ లోని బాక్సైట్ గనుల తవ్వకాలను అదివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కన్నెధారకొండ మైనింగ్ లీజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 9 మండలాల పరిధిలోని 276 ఆదివాసీ గ్రామాలకు చెందిన లక్షాయాభైవేల మందిని నిర్వాసితుల్ని చేసేందుకు పాలకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాలోని ఆదివాసులు బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తేనే ‘ఆడవికి ఆడవి’, ‘భూమికి భూమి’ నినాధంతో ఉద్యమిస్తున్నారు.
ఆదివాసీ జీవనంపై విష సాంస్కృతిక దాడి:
ఓ వైపున ఆదివాసులు జీవనాన్ని ఈ విధంగా విధ్వంసం చేయటంతో పాటు మరోవైపున వారి సంస్కృతిని, జీవన విధానాన్ని కూడా కబళించేందుకు కనుమరుగుచేసేందుకు, పాలకులు విష సాంస్కృతిక దాడిని తీవ్రం చేశారు. గత రెండు దశాబ్దాల కాలంలోనూ పనిగట్టుకొని ఆదివాసుల సంస్కృతీ, సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేసేందుకు సామ్రాజ్యవాద సాంస్కృతిక మాధ్యమాలను ఆదివాసుల మధ్యకు జొప్పిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామనే పేరిట, విద్యుత్తు వెలుగుల మాటున వినోదం, విజ్ఞానం బదులుగా వస్తు వ్యామోహ సంస్కృతితో ముంచెత్తుతున్నారు. టీ.వి.లను, సెల్ఫోన్లను ఆదివాసులకు కూడా అందుబాటులోకి తేవడమే, వారి అభివృద్ధికి నిదర్శనంగా పాలకవర్గ మేధావులు చంకలు గుద్దుకుంటున్నారు. వాస్తవానికి ఆదివాసీ సమూహాల నడుమÑ సముహంలోని ఆదివాసుల నడుమ ఆది నుండి కొనసాగుతూవస్తున్న ఒక ఆత్మీయ సమిష్టి పోరాట జీవబంధానిన్ని గొంతునులిమివేయదలచుకున్నారు.
ఆదివాసీ సంక్షేమాన్ని అటకెక్కించిన పాలకులు:
ఆగస్లు 15, జనవరి 26ల సందర్భంగా మువ్వన్నెల జెండాలను వాడవాడలా ఎగురవేసి దళిత,పీడిత, తాడిత ప్రజల అభివృద్ధీ, సంక్షేమమే తమ లక్ష్యంగా గొంతుచించుకొనే పాలకులు ఆ ప్రజలకు ముఖ్యంగా నాగరిక సమాజానికి దూరంగా నేటికి ‘పీడితుల్లోకెల్లా అధమాధముల’లుగా అత్యంత దయనీయ పరిస్థితుల నడుమ జీవనం సాగిస్తున్న ఈ దేశపు మూలవాసులైన ఆదివాసుల సంక్షేమానికి చేపడ్తున్న విధానాలు, చర్యలూ శూన్యమనేది స్పష్టమౌతున్నది. ఆదివాసుల విద్యా,వైద్యాల కోసం, సంక్షేమం కోసం కేటాయించిచే నిధులను కూడా పాలకులు క్రమంగా కుదించివేస్తూ వస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో గిరిజన సబ్‌ప్లాన్‌క్రింద 6.6 శాతం నిధులను ఆదివాసుల అభివృద్ధి కొరకు ఖర్చుచేయాలి. కానీ కేటాయించిన నిధులనైనా నిర్థిష్ట లక్ష్యాల కోసం వెచ్చించకుండా ఇతరేతర పద్దుల లోకి దారి మళ్ళిస్తున్నరు. ఇక, గిరిజన సంరక్షకులుగా అవతారమెత్తిన ఐటిడిఏ మొదలుకొని ఉన్నతాధికారులూ, ప్రజాప్రతినిధుల అవినీతి కోటలను దాటుకొని గిరిజన సంక్షేమానికి దక్కేది గుండుసున్నా అనేదేఇ కళ్ళెదుట కన్పడుతున్న వాస్తవంగా వుంది.
అదివాసులకు మృగ్యమైన కనీస ప్రభుత్వ వైద్యం:
ఆదివాసీ ప్రజానీకం కనీసం పౌష్టికారం కరువై, అనారోగ్యాలతో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆదివాసుల్లో 50 శాతం మందికి కనీస పౌష్టికాహారం అందటం లేదు. మహిళలు ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం కారణంగా పురుట్లోనే ప్రాణాలిడుస్తున్న పసిబిడ్డల సంఖ్య ఆదివాసీలో అత్యధికంగా వుంది. ఆదివాసుల్లో శిశు మరణాలు ప్రతి వెయ్యి మంది శిశువులకుగాను 150 నుండి 250 వరకూ వుంటున్నాయి.
అత్యధిక ఆదివాసీ గ్రామాల్లో ఈనాటికీ కనీసపాటి వైద్య సదుపాయం కానీ, తగిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు, వసతి సౌకర్యాలు కానీ అందుబాటులోలేవు. 1999లో విశాఖ ఏజన్సీలో విషజ్వరాల బారినపడి 3 వేల మందికిపైగా అదివాసులు మరణించిన సంచలన సంఘటనపై ఆనాటి మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ డా॥ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమీషన్ సమస్యను సాకల్యంగా పరిశీలించి సవివరంగా పరిష్కారాలను సూచిస్తూ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పాలకులు ఏనాడో పాతిపెట్టేశారు. ఈ సంవత్సరం జులై నాటికే విశాఖ ఏజన్నీలోనే 100 మందికి పైగా ఆదివాసులు మరేరియా, డయేరియా, కామెర్లవ్యాధులతో చనిపోయారు. గత సంవత్సరం విజయనగరం జిల్లాలోనే 4 వేల మంది ఆదివాసులు మరేరియా బారిన పడ్డారు. ఇప్పటిరే ఈ ఏడాది ఆదివాసీ ప్రాంతాల్లో 280 మంది డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురయ్యారు. ఫాల్సీఫారమ్ మలేరియా మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు.
ప్రమాదకర వ్యాధులు వ్యాపించే వానాకాలం ముందుగా మే నెలలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చేయాల్సిన దోమలనిరోధక రసాయనాల స్ఫ్రేయింగ్ మరుగునపడిరది. ప్రభుత్వపరంగా ఆదివాసులకు అందించే మెడికేటెడ్ దోమతెరల పంపకం నామమాత్రమే. ఆదివాసీ ప్రాంతాల్లో దాదాపుగా రక్షిత మంచినీరు ఊసేలేదు. గిరిజన ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థులు గజ్జి, దురదలు వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆదివాసీ బాలికల్లో, మహిళల్లో గైనిక్ సమస్యలు తీవ్రంగా వున్నాయి. అత్యవసర సేవేలకోసం ఏర్పాటు చేసే ఎపిడమిక్ సెల్ జాడే లేదు. అంబులెన్స్‌లు ఒకటో అరో వున్నా అవి పనిచేయవు. సిబ్బందివుండరు. దీనికి తోడుగా మలేరియా నివారణ పనుల్లో, మందులు చల్లటంలో పాల్గోన్న దినసరి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవటంతో వారంతా తిరిగి విధుల్లోకి రావటానికి సిద్ధగాలేరు.
ఆదివాసుల విద్యా, ఉద్యోగావకాశాల కుదింపు:
ఇదే విధంగా ఆదివాసీ విద్యా సౌకర్యాలను కూడా పాలకులు క్రమంగా హరించివేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాటికీ అదివాసుల్లో అక్షరాస్యత 16 శాతానికి మించలేదు. ఆదివాసీ విద్యార్థుల కోసం నిర్మించిన సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. కాగా ఇప్పుడీ గిరిజన సంక్షేమ హాస్టళ్ళను, గురుకుల పాఠశాలలను కుదించివేస్తున్నారు. గురుకుల ఆదివాసీ పాఠశాలల్లో చదువుకుంటున్న ఆడపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా వుంది. వీరిపై వేధింపులు, లైంగిక దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణ మయ్యాయి. ఇటీవలి కాలంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చెబుతూ ‘గర్దాసిల్’ అనే టీకాను గురుకుల పాఠశాలలో చదువుకునే ఆదివాసీ బాలికలపై ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ అనైతిక ఔషధప్రయోగాల ఫలితంగా వీరిలో కొందరు మరణించగా అనేకమంది ఔషధ పరీక్షల దుష్ఫలితాలనెదుర్కొంటున్నారు.
అదివాసులకు ఉద్యోగ ఉపాధి కల్పనను కనీసం చదువుకున్న అదివాసులకైనా ఉద్యోగ కల్సనావకాశాలను కుదించి వేస్తున్నారు. ఎలాంటి హక్కూలూ, భద్రతా లేని తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో మాత్రమే కొన్నైనా అవకాశాలు కల్పిస్తున్నారు. గత 10 సంవత్సరకాలంలో 15 వేల అదివాసుల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగావున్నప్పటికీ వాటిని భర్తీ చేయలేదు. రానున్న కాలంలో అటవీ ప్రాంతాల్లో మరింత తీవ్రం కానున్న ఆదివాసీ ఉద్యమాలను అణచివేసేందుకు ‘మనకంటిని మన వేలితోనే పొడిచే’ విధానాన్ని ఎంచుకున్నారు. ఆదివాసీ యువకులకు ఈ మధ్యకాలంలో ఎమైనా ఉద్యోగాలు కల్పించారు. అంటే అవి పోలీసు కానిస్టేబుల్ ఉద్యగాలు మాత్రమే!
ఆదివాసులపై నిర్బంధం
అణచివేత:
ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసుల పోరాటాలను ఏఎఫ్ఎస్పిఏ వంటి క్రూర చట్టాలతో, పాశవిక నిర్బంధాన్ని ప్రయోగించి పాలకులు అణయివేయ జూస్తున్నారు. అస్సాంలో ఆదివాసుల గుడిశలను ఏనుగులతో తొక్కిస్తే, గుత్తికోయల గ్రామాలను మన రాష్ట్రంలో తగులబెట్టించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారు. ‘‘గ్రీన్‌హంట్’’ పేరిట ఆదివాసీ ప్రాంతాలన్నింటా పోలీసు, సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నక్సలైట్లను అణచివేసేందుకోసం ‘సాల్వజుడుం’ పేరిట ఆదివాసుల నుండే ప్రత్యేక బలగాలను రూపొందించి, శిక్షణ గరిపి, ఆయుధాలిచ్చి వారిని ప్రయోగిస్తున్నారు.
ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ సాంస్కృతిక విష కాలుష్యంతో నింపి వేయటంతోపాటు, దోపిడీ వ్యవస్థపై వారి పోరాటం ఎక్కుబెట్టకుండా అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. నిరాటంకంగా అటవీ ప్రాంతంలోని సమస్త వనరులనూ కొల్లగొట్టేందుకు అనువుగామానవరహిత అడవులుగా మార్చేందుకు
సామ్రాజ్యవాదుల దరపున దళారీ పాలకులు పూనుకొని వ్యవహరిస్తున్నారు.
ఆదివాసీ పోరాట యోధుల వారసత్వంతో ఉద్యమించాలి:
ఆదిమకాలం నుండీ ప్రకృతి బీభత్సాలకు, క్రూర మృగాలకు ఎదురొడ్డి పోరాడిన సమరశీల వారసత్వం తమ స్వంతమైన ఆదివాసులుబ్రిటిష్ వలసవాదుల ఆయుధసంపత్తి, సైనిక బలగాల ముందుకూడా తలవంచకుండా వీరోచిన పోరాటం సాగించారు. మనదేశంలో చదువుకున్న మధ్యతరగతి కంటే ముందుగానే మేల్కోని వలసవాద వ్యతిరేక జాతీయోద్యమానికి మార్గదర్శకంగా నిలిచారనంటం అతిశయోక్తికాబోదు. నగ్జల్బరీ, శ్రీకాకుళ గిరిజన పోరాటాలలో వీరోచితంగా పోరాడి భూస్వాముల, దోపిడీ పాలకుల గుండెలదరగొట్టిన ఘన చరితకు వారసులు ఆదివాసులు. ఈనాటికీ ఈశాన్య రాష్ట్రాలతో సహా రaూర్ఖండ్, ఒడిషా, కేరళ తదితర రాష్ట్రాలన్నింటా ఆదివాసుల పోరాటాలు సాగుతున్నాయి. ఈ సంక్షిష్ట నేపథ్యంలో ఆదివాసుల పోరాటాలను ప్రక్కమార్గం పట్టించే అన్ని రకాల ధోరణులనూ ఎదుర్కొని ఓడిరచాలి. ఆదివాసీ పోరాట యోధులు బీర్సాముండా మొదలు కొమురంభీం వరకూ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని ఆదివాసీ ఉద్యమాలు స్వంతం చేసుకోవాలి. అటవీ భూముల సేకరఠణకు, విస్తాపనకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సాగిస్తున్న ఉద్యమాలను మరింత సమైక్యగా, సంఘటితంగా సమరశీలంగా ఇతర పీడిత వర్గాల సమన్వయంతో సాగించాలి.