TS: గ్రూప్ 4 తుది ఫలితాల్లో ఉద్యోగాలు సంపాదించిన వారికి సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 4న పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపనున్నారు. అదే వేదికగా గ్రూప్ 4తో పాటు, వివిధ నియామకాల ద్వారా ఎంపికైన దాదాపు 9 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
సచివాలయంలో శనివారం సాయంత్రమే ‘ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు’పై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తొంది. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక లెటర్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా వీటిని అందజేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
రేవంత్ సర్కార్ ప్రజాపాలన ఏడాది పూర్తైన సందర్భంగా విజయోత్సవాకు పిలుపునిచ్చింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా ఈ విజయోత్సవాలు జరగనున్నాయి. అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లో వీటిని జరిపేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.