TS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ నేతలతో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ విజయోత్సవాల గురించి అధిష్ఠానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.
ఢిల్లీలో సీఎం రేవంత్ ఏఐసీసీ అగ్రనేతలను కలుస్తారని సమాచారం. విజయోత్సవాల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రత్యేక ఆహ్వానం అందజేయనున్నారు. ముఖ్యంగా డిసెంబరు 9న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం వారిని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోగా మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీపై కూడా ఈ పర్యటనలో చర్చ జరగనుంది. అలాగే, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీ, కులగణన వంటి అంశాలు కూడా ఈ చర్చలలో ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి కూడా సీఎం రేవంత్ హాజరవుతారని సమాచారం.