- భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు
- ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం
- అదానీ అంశంపై కాంగ్రెస్ చర్చించే అవకాశం
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రోజు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. సభా వ్యవహారాల సంఘం (బీఏసీ)లో నిర్ణయించిన అంశాల ఆధారంగా మిగిలిన రోజుల్లో సభలు కొనసాగనున్నాయి. దీనికి సన్నాహకంగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 30 పార్టీల నుంచి 42 మంది నేతలు దీనికి హాజరయ్యారు.
అదానీ అంశంపై చర్చించాలి: కాంగ్రెస్
అదానీ అంశంలో పట్టు బిగించాలని విపక్షం పట్టుదలతో ఉంది. దీనిపై సమావేశాల్లో చర్చించాలని తాము అఖిలపక్షంలో డిమాండు చేసినట్లు లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్ వెల్లడించారు. ఈ కుంభకోణం అమెరికాలో బయటపడినందున దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా మణిపుర్ హింస పైనా సమాధానమివ్వాలని సూచించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని జైలుకు పంపిన కేంద్ర ప్రభుత్వం మణిపుర్ సీఎంను ఎందుకు ఉపేకిసోందని ప్రశ్నించారు.