AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, ఓడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. వాయుగుండం కారణంగా కుండపోతగా వర్షాలు కురవడంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ జిల్లాల్లోని వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాల్లో గోదావరికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజి దగ్గర వరద పెరగడంతో సముద్రంలోకి 3,10,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం 10.44 అడుగులుగా ఉంది. భారీ వర్షాల కారణంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజికి భారీగా వరద పోటెత్తింది. దీంతో బ్యారేజి నుంచి కాల్వల ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
విశాఖ, అనకాపల్లిలో భారీ వర్షాల కురుస్తున్న కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.