కువైట్‌లోని మంగఫ్ సిటీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 45 మంది భారతీయులు మరణించారు. వారి భౌతికకాయాలతో కువైట్ నుంచి బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన విమానం కేరళకు చేరుకుంది. ఉదయం 11 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మృతుల భౌతికకాయాలకు కేరళ సీఎం పినరయి విజయన్ నివాళులర్పించారు.
ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ మృతదేహాల వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. సీఎంతోపాటు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఇతర అధికారులు కూడా నివాళులర్పించారు. మరోవైపు విమానాశ్రయంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శవపేటికల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.