సుక్మాలో మావోయిస్టు సప్లయర్ అరెస్ట్ ? కాదంటున్న ఆదివాసీ, హక్కుల సంఘాలు

Published on 

నక్సలైట్లకు సరుకులు సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సుక్మా పోలీసు అధికారులు తెలిపారు. 09.06.2024 ఆదివారం దేవరపల్లి అటవీ ప్రాంతంలో సుక్మా జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ , పోలీస్ సబ్-డివిజనల్ ఆఫీసర్ శ్రీ నిశాంత్ పాఠక్ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో దోర్నపాల్‌ నుంచి జాగర్‌గుండకు అనుమానాస్పద వ్యక్తి నక్సలైట్లకు సరుకులను రవాణా చేస్తున్నాడనే సమాచారం రావడంలో అప్రమత్తమైన అధికారులు అనుమానాస్పద వ్యక్తిని చుట్టుముట్టి పట్టుకున్నట్లు తెలిపారు.

అనుమానితుడి పేరు కృష్ణ కుమార్ కడ్తి అలియాస్ జోగా అని గుర్తించినట్లు తెలిపారు. అతన్ని తనిఖీ చేయగా ప్లాస్టిక్ బ్యాగ్‌లో 2 బండిల్స్ ఎలక్ట్రిసిటీ వైర్, 5 ఎలక్ట్రిక్ డిటోనేటర్, 5 మీటర్ల కార్డెక్స్ వైర్, 20 జెలటిన్ రాడ్స్, 10 పాలీబియాన్ ఇంజెక్షన్స్, 7 న్యూరోబియన్ ఇంజెక్షన్స్, ఒక కాటన్ స్ట్రిప్ ప్యాకెట్, 5 గ్లూకోజ్ బాటిల్స్, 10 సిరంజిలు, నక్సలైట్లకు సంబంధించిన సాహిత్యంతో పాటు బ్యానర్‌ను లభించిన్నట్లు తెలిపారు.

నిషేధిత మావోయిస్టు సంస్థ యొక్క అగ్ర నేతల సూచనల మేరకు అర్భన్ సప్లయర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. నింధింతుడిపై పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 4, 5 కింద కేసు నమోదు చేయబడినట్లు, సోమవారం కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.

అయితే, అరెస్టు చేసిన వ్యక్తి మూలవాసీ బచాబో మంచ్‌కు చెందిన కార్యకర్త అని ఆదివాసీ, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సిలింగేర్ మూడవ వార్షికోత్సవ అనుమతి కోసం జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లిన వెళ్లిన మడకం జోగాను మరో ఇద్దరితోపాటు ఈనెల 8వ తేదీని పొల్లంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. మరుసటి రోజు సోడి భీమా, మడియం జోషన్‌లను విడుదల చేసినప్పటికీ మడకం జోగాను విడుదల చేయకుండా కుట్రపూరితంగా నక్సలైట్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌరహక్కుల నేత ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో వేధించేందుకు పోలీసులు కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. రెండు రోజులపాటు వాళ్లను ఎక్కడ ఉంచిందీ తెలియజేయకుండా ఆదివాసులను ఆందోళనకు గురి చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలను నిర్భందిస్తున్నారని, కనిపించిన వాళ్లను, దొరికిన వాళ్లను నక్సలైట్ల పేరుతో ఎక్కడికక్కడ కాల్చేస్తున్నారని, వాళ్ల ప్రాణాలకు భద్రత లేదని వాపోయారు. అరెస్టు చేసిన ఆదివాసీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేయడానికి, పర్యావరణాన్ని నాశనం చేయడానికి వాళ్ల మీద సైనిక దాడి చేయడమేగాక, ఈ బాధలను, దు:ఖాన్ని ఇతరులకు చెప్పుకోడానికి మైదాన ప్రాంతానికి రావడం కూడా నేరమైపోయింది పౌరహక్కుల సంఘం నేత ప్రొ.లక్మణ్ ఆరోపించారు. అడవుల్లో గనుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసులను అణచివేయడానికి వాళ్ల గ్రామాల మధ్య సైనిక క్యాంపులు పెట్టి, దాన్ని నిరసించినందుకు ఐదుగురిని కాల్చేసి, వాళ్ల సంస్మరణ సభను పెట్టుకోవడం కూడా ప్రభుత్వానికి అభ్యంతరమైపోయిందవి విమర్శించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form