బీజేపీ ఎంపీ అభ్యర్ధి, బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నకారణంగా బ్రిజ్ భూషణ్ సింగ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో బుధవారం ఉదయం బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఎస్‌యూవీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న 17 ఏళ్ల రెహాన్, 24 ఏళ్ల షాజాద్ మరణించారు. రోడ్డు వద్ద ఉన్న 60 ఏళ్ల సీతా దేవి గాయపడింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో కరణ్ భూషణ్ సింగ్ ఆ కాన్వాయ్‌లో ప్రయాణించాడా లేదా అన్నది నిర్ధారణ కాలేదు. బ్రిజ్ భూషణ్ కుటుంబం నిర్వహిస్తున్న విద్యా సంస్థ పేరు మీద ఆ వాహనం రిజిస్టర్ అయ్యిందని పోలీసులు గుర్తించారు.