ఇజ్రాయెల్ దాడులతో మరభూమికగా మారిన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని సైమన్ హారిస్, విదేశాంగ మంత్రి మిచెల్ మార్టిన్ బుధవారం ప్రకటించనున్నారు.
పాలస్తీనాను దేశంగా గుర్తించాలని ఇప్పటికే ఇందులో భాగంగా ఐర్లాండ్, స్పెయిన్, స్లొవేనియా, మాల్టా పాలకులు నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఖాయమని ఐర్లాండ్ విదేశాంగ మంత్రి మిచెల్ మార్టిన్ ఈ నెల 17న తెలిపారు. ఇందులో భాగంగానే నేడు ప్రకటన వెలువడనుంచి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగుతున్నది. హమాస్‌కు ప్రధాన కేంద్రంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో అక్కడున్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. నెతన్యాహ్యూ సేనల దాడుల్లో వేల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి చిగురించాలని పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదీ కల్పించడమే పరిష్కారమని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి.
కాగా, ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్యదేశాల్లో 137 దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. పాలస్తీనాకు ఈయూ దేశాల మద్దతు లభించినప్పటికీ ఫ్రాన్స్, జర్మనీ నుంచి మద్దతు దొరకట్లేదు.