స్వాతి మాలివాల్‌పై దాడి అబద్ధం : ఢిల్లీ మంత్రి అతిషి

Published on 

ఆప్‌ ఎంపీ స్వాతి మాలివాల్‌ కేసు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. నిన్నటి వరకూ ఆమెకు అండగా ఉంటూ వచ్చిన ఆప్ ఇవాళ యూ టర్న్ తీసుకుంది. బీజేపీ కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపించింది.

వివరాల్లొకి వెళితే, కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై తీహార్‌ జైలు నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఓర్వలేని బీజేపీ కేజ్రీవాల్‌కు చెడ్డపేరు తేవడం కోసం బీజేపీ రకరకాల కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఈ నెల 13న స్వాతి మాలివాల్‌ను కేజ్రీవాల్‌ నివాసానికి పంపించారని అన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. బీజేపీ కుట్రలో స్వాతి మాలివాల్‌ పావులా మారిందని మండిపడ్డారు.

వాస్తవానికి సీఎం కేజ్రీవాల్‌ను దోషిని చేయాలని వాళ్లు కుట్ర పన్నారని, కానీ గొడవ జరిగిన సమయంలో కేజ్రీవాల్‌ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అతిషి వ్యాఖ్యానించారు. అప్పాయింట్‌మెంట్ తీసుకోకుండానే స్వాతిమాలివాల్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారని, అప్పాయింట్‌మెంట్‌ కాపీ చూపించమని భద్రతా సిబ్బంది అడిగడంతో వారితో గొడవ దిగారని ఆరోపించారు. సోఫాలో దర్జాగా కూర్చుని పోలీసులను బెదిరించారని చెప్పారు. జోక్యం చేసుకున్న విభవ్‌ కుమార్‌తో కూడా ఆమె దుర్భాషలాడారని అన్నారు.

పైగా విభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని, తనను కాలితో తన్నాడని, బట్టలు చించాడని, తలను టేబుల్‌కేసి కొట్టాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. వాస్తవానికి ఆమెపై దాడి అనేదే జరగలేదని, ఇవాళ బయటికి వచ్చిన వీడియో క్లిప్పింగే అందుకు నిదర్శనమని అన్నారు మంత్రి అతిషి. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవని చెప్పారు.

కాగా ఆ ఘటన జరిగిన రోజుకు సంబంధించిన ఓ క్లిప్పింగ్‌ను అప్ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసి, దానికి ‘స్వాతి మాలివాల్‌ కా సచ్‌’ అనే టెక్స్ట్‌ను జతచేసింది. ఆ వీడియోలో కేజ్రీవాల్‌ భద్రతా సిబ్బందిని స్వాతి మాలివాల్‌ బూతు పదజాలంతో దూషించింది. ‘గంజా సాలా’ అని వ్యాఖ్యానించింది. అయితే ఆప్‌ పోస్టు చేసిన వీడియో ఒరిజినలా.. నకిలీదా అనే విషయాన్ని తాము ఇంకా డిసైడ్‌ చేయలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form