నా జోడో యాత్రకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రేరణ: రాహుల్

Published on 

  • బీజేపీకి బీ టీంగా బాబు, జగన్, పవన్.
  • రాజశేఖర్ రెడ్డి దేశానికే మార్గదర్శి
  • బీజేపీకి, రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడు వ్యతిరేకమే.
  • కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది.
  • భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.

ఆంధ్రా రాష్ట్రాన్ని బీజేపీకి బీ టీం నడిపిస్తుందని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. బీజేపీకి బీ టీం అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు ఆయన. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ.

రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడు అని.. వాళ్ళిద్దరిది రాజకీయ సంబంధమే కాదు అన్నాతమ్ములు లాగా కలిసిమెలిసి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కడపలో రాహుల్‌ ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి మార్గదర్శకులుగా ఉండేవారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తన జోడో యాత్రకు ప్రేరణ అని ఆయన వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి దేశవ్యాప్తంగా మీరు పాదయాత్ర చేయాలని తనతో చెప్పాడని రాహుల్‌ పేర్కొన్నారు.ఎప్పుడైతే మనం పాదయాత్ర చేస్తామో అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని వైఎస్సార్ చెప్పారన్నారు. తాను రాజశేఖర్ రెడ్డి ద్వారా ప్రేమ విద్వేషపు ప్రాంతాల్లో ప్రేమను వికసింపజేశానన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదన్నారు. మార్పుతో కూడిన రాజకీయం నేడు నడుస్తోందన్నారు.

బీజేపీకి, రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందన్నారు. కానీ జగన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. అవినీతి కేసులు జగన్‌పై ఉండటమే కారణమని, ఇదే అలవాటు చంద్రబాబు నాయుడుకు కూడా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఒక హామీనిచ్చి విస్మరించిందని గుర్తుచేశారు. ఏపీ విభజన సమయంలోప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రజలకు వాగ్దానం చేసిందని..అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో హామీలు ఇచ్చి విస్మరించిందని అటువంటి పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. రెండున్నర లక్ష ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఐదు లక్షలతో నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాం. మా ప్రభుత్వం రాగానే ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసి తీరుతాం. ఏడాదికి ఒక మహిళ అకౌంట్‌కు లక్ష రూపాయలు జమ చేస్తామన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రక్తాన్ని చిందించి కష్టపడుతున్నారని, భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form