సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చిరెండు లక్షలకు పైగా పుస్తకాలు సమకూర్చి సమాజానికి అంకితం చేసిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య నేడు ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనలో గురువారం జరిగే కార్యక్రమంలో ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పురస్కారాన్ని అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన ఆహ్వానం మేరకు ఆయన బుధవారం ఢిల్లీ బయలుదేరివెళ్లారు.
చదువుకోవడానికి పుస్తకాలు దొరక్కపోవడంతో తనలా మరొకరు అవస్థలు పడకూడదని భావించి 2014లో తన సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. అందులో రెండు లక్షలకు పైగా పుస్తకాలు సమకూర్చి సమాజానికి అంకితం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక సాహితీ సంస్థలు స్థాపించి ఎందరో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కవులు, కళాకారులను వెలికి తీసేందుకు ఈ సంస్థలు కృషి చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన విఠలాచార్య 1938, జూలై 9న కూరెళ్ల వెంకటరాజయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.