అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి కనిపించకుండా పోయాడు. షికాగో నగరంలో నివసిస్తున్నరూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra Chintakindi) షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి కిడ్నాపై అనంతరం హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలు మరువక ముందే తెలంగాణకు చెందిన మరొక విద్యార్థి మిస్సింగ్ భయాందోళనకు గురి చేస్తోంది. మే 2 నుంచి రూపేష్ చంద్ర ఆచూకీ లభించడం లేదు. ఈ మేరకు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను సంప్రదిస్తున్నట్లు రూపేష్ చంద్ర తండ్రి సదానందం తెలిపారు. అలాగే ఎన్నారైలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అతని జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా, రూపేశ్ గురించి తెలిస్తే తమకు సమాచార అందించాలంటూ పోలీసులు స్థానికులను కోరారు.
హన్మకొండలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన వరంగల్‌లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ చేశారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన తమ కుమారుడి జాడ తెలియకపోవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురవతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసకుంటున్న విషయం తెలిసిందే. దాడులు, కిడ్నాప్‌ల వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.