అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 46వ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి
(ఏటీసీఎం) అధికారికంగా సమాచారం ఇవ్వనుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ 26వ సమావేశానికీ తెలియజేయనుంది. ఈ నెల 20 నుంచి 30 వరకూ కోచిలో ఈ రెండు భేటీలు జరుగుతాయి. దక్షిణ ధ్రువ ప్రాంతంలో పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న దేశాలు ఈ సమావేశాల్లో పాల్గొంటాయి. ప్రస్తుతం భారత్ కు అంటార్కిటికాలో మైత్రి, భారతి అనే రెండు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మైత్రిని 35 ఏళ్ల కిందట నిర్మించారు. భారతి 12 ఏళ్ల నాటిది. మైత్రి కేంద్రం పాతబడిపోయిందని, దానికి సమీపంలో మరో కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ తెలిపారు. అంటార్కిటికా ప్రాంతంలో ఏదైన భారీ పని చేపట్టాలంటే ఏటీసీఎం అనుమతి అవసరం. మైత్రి-2 పేరిట కొత్త కేంద్రాన్ని భారత్ నిర్మించనుంది. అది సిద్ధమయ్యాక పాత ప్రాంగణాన్ని వేసవి శిబిరంగా మార్చనుంది.