ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహాం బయటపడింది. ఆ నీటిని రెండు రోజులుగా లెక్చర్లర్లు, విద్యార్థులు వాడుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన భర్త, అత్తతో కలిసి గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ యూనివర్సిటీ సమీపంలో నివసిస్తూ జిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అయితే ఆ మహిళకు భర్తతో తరచూ గొడవలు జరుగుతుండేవని ఆదివారం రాత్రి సైతం గొడవ జరగడం, అది కాస్తా పెద్దదిగా మారడంతో.. భార్యను దారుణంగా హత్య చేసి అనంతరం మృతదేహాన్ని యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో పడేశాడని పోలీసులు నిర్దారించారు.
ఆదివారం నుంచి సదరు మహిళ కనిపించట్లేదని బంధువుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వాటర్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే వాటర్ ట్యాంక్ నీటిని యూనివర్సిటీ స్టాఫ్, విద్యార్థులు వాడటం నిర్ఘాంతపరిచింది. వారంతా ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు.