శ్రీనగర్: పహల్గామ్‌లోని బైసరన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో పర్యాటకులను రక్షించడంలో ప్రాణాలకు తెగించి సహయం చేసిన 34 మంది స్థానిక యువకులను హిమాలయన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (HWO) ఆదివారం సత్కరించింది. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు మరియు ఒక స్థానిక పోనీ ఆపరేటర్ ప్రాణాలు కోల్పోయాయిన విషయం తెలిసిందే.
అయితే స్థానిక గైడ్‌లు, అడ్వెంచర్ ఆపరేటర్లు, పోనీ హ్యాండ్లర్ల ఉగ్రదాడి ఘటన జరిగిన వెంటనే సాహసోపేతమైన ప్రతిస్పందించి మరింత ప్రాణనష్టాన్ని నివారించారని కొనియాడారు. వీళ్లు చూపించిన తెగువ దేశవ్యాప్తంగా విస్తృత ప్రశంసలను అందుకుంటుందని HWO సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్వామా ఎమ్మెల్యే వహీద్ ఉర్ రెహమాన్ పర్రా మాట్లాడుతూ యువత ధైర్యాన్ని ప్రశంసించారు. మానవత్వం చాటేందుకు స్ధానిక యువత ప్రాణాలను పణంగా పెట్టారని ప్రశంసించారు.
కాశ్మీరియత్ విలువలను కాపాడినందుకు యువకులను HWO చైర్మన్ ముష్తాక్ పహల్గామి ప్రశంసించారు. ఈ ధైర్యవంతులైన యువకుల కారణంగా ఉన్నతంగా తల ఎత్తుకొని నిలబడగలుగుతున్నామని, యువకులు నిజంగా కాశ్మీర్ స్ఫూర్తిని బలోపేతం చేశారని అన్నారు.
పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన స్థానిక పోనీ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ షాతో సహా మృతుల జ్ఞాపకార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. మరణించిన వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు.
