బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ విచారణను జరిపించాలి : CASR

Published on 

మే11, 2024న బీజాపూర్‌లో 12 మంది ఆదివాసీలను భారత సాయుధ బలగాలు అత్యంత క్రూరంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సొంత ప్రజలపై ప్రభుత్వం పాల్పడుతున్న జాతి నిర్మూలన కార్యక్రమాన్ని ఆపాలని క్యాంపెయిన్ అగెనెస్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR )డిమాండ్ చేసింది.

దేశంలోని వివిధ విద్యార్థి, హక్కుల సంఘాలతో కూడిన ఈ కమిటీ ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ విచారణను జరిపించాలని డిమాండ్ చేసింది.

మే11, 2024న, బీజాపూర్ జిల్లాకు చెందిన 12 మంది, పెడియా గ్రామానికి చెందిన 5గురిని, అలాగే ఈతావర్ గ్రామానికి చెందిన 7 మందిని భారత రాష్ట్ర పారామిలిటరీ బలగాలు అత్యంత క్రూరంగా హతమార్చాయని ఆరోపించింది.

వేసవి సీజన్‌లో ఆదివాసీ రైతులు దీర్ఘకాలికంగా వస్తున్న తమ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి అయిన తునికాకు(బీడీ ఆకు) సేకరించేందుకు ఈ గ్రామస్థులు బయలుదేరారని, భద్రతా బలగాలను చూసి భయపడి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని విచక్షణారహితంగా కాల్చిచంపారని విమర్శించారు. చాలా మంది గ్రామస్తులను వారి ఇళ్ల నుండి బయటకు లాగి కాల్చి చంపారని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడిన 30 మంది ఆదివాసీలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయన్నారు. ఇప్పటి వరకు కేవలం 25 మందిని మాత్రమే విడుదల చేసి ఇంకా ఐదుగురిని ఏం చేశారో తెలియదని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కమిటీ సభ్యులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, చనిపోయిన ఆదివాసీలలో బాసగూడ స్కూల్‌లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థి సేతు కుంజం, చన్ను అవలం కూడా ఉన్నారన్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలిలో 3 బుల్లెట్లు తగిలి గాయపడినప్పటికీ అసుపత్రికి వెళితే ఎక్కడ భద్రతా దళాలు హతమారుస్తాయేమో అనే భయంతో అసుప్రతికి కూడా వెళ్లడం లేదని తెలిపారు.

ఇది బస్తర్‌లో జరిగిన ఒక సంఘటనే మాత్రమే కాదని, బస్తర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడిన చరిత్ర ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో, మధ్య భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లో రైతాంగంపై జరుగుతున్న ఈ దాడి మరింత తీవ్రమైందన్నారు.

మావోయిస్టులను మట్టుబెట్టే పేరుతో ఆదివాసీ రైతులపై మారణహోమం సాగిస్తున్నారని, ఇజ్రాయెల్ తయారు చేసిన డ్రోన్‌లు ఏరియల్ బాంబింగ్‌తో సహా అధునాతన ఆయుధాలను ఉపయోగిస్తున్నారు.

ఈ జనవరిలోనే బస్తర్‌లోని గ్రామాలపై 5 సార్లు బాంబు దాడులకు పాల్పడ్డారని, మావోయిస్టుల నిర్మూలన పేరుతో ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల కాళ్లకింది సహజ వనరులను కార్పొరేట్ దోపీడిని సులభతరం చేయాలని భారత రాజ్యం కోరుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఆదివాసీ రైతులను మావోయిస్టులుగా ముద్ర వేసి హత్య చేయడాన్ని CASR తీవ్రంగా ఖండిస్తుందని, ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ విచారణను జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మారణహోమాన్ని ఖండించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించే వారందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form