భార్య వేదింపులకు మరో నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం జరిగి నెల రోజులు గడవకముందే హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కోడలు, ఆమె తరపు బంధువుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి, తల్లి, స్నేహితులు ఆరోపించారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడి సంతోష్ సోదరి భారతి, తల్లి మంగమ్మ, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడి సంతోష్ సోదరి భారతి మాట్లాడుతూ.. నా తమ్ముడు సంతోష్ భార్య ఆమె తరపు బంధువులు వేధింపులు పెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల మే 9న రామంతపూర్ కు చెందిన శారదతో వివాహం చేశాము. శారదకు గైనిక్ సమస్యలు ఉన్న విషయం మాకు చెప్పకుండా పెళ్లి చేశారు. మా ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కనిపించింది. ఆమెకు సమస్యలు ఉన్నట్లు తమకు ఎందుకు చెప్పలేదని శారదను ఆమె కుటుంబ సభ్యులను నిలదీశాం. అప్పటినుండి నా తమ్ముడు సంతోష్‌కు శారద, ఆమె మేనమామలు, తల్లి, తమ్ముడు బెదిరింపులు స్టార్ట్ చేశారు. నువ్వే పెళ్లి చేసుకున్నావ్. కాబట్టి నీదే భారం అని నా తమ్ముడిని మానసికంగా వేదించారు. దీంతో జులై 4న శారద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరసటి రోజు నా తమ్ముడు సంతోష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
మేము నాచారం పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. మరసటి రోజు హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు లేక్ పోలీసులు తెలిపారు. అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా నా తమ్ముడిని వేధించారు. వాటికి సంబంధించిన ఆడియోలు హాస్పిటల్ రిపోర్టులు మా వద్ద ఉన్నాయి. సమస్య ఉందని తెలిసినా.. ఎందుకు పెళ్లి చేశారని శారద వాళ్ళ తల్లిని అడుగుతున్న ఆడియో కూడా మా వద్ద ఉంది. శారదని మా దగ్గర ఉంచుకోకపోతే కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతామని వాళ్లు బెదిరించారు. నా తమ్ముడి ఆత్మహత్యకు కారణమైన శారదాను ఆమె కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి సంతోష్ సోదరి భారతి, తల్లి మంగమ్మ, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.
