కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార సభలలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణలోని నర్సాపూర్ లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు రాహుల్ గాంధీ హాజరవనున్నారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే జన జాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీ అభ్యర్థులు పాల్గొననున్నారు.
అదేవిధంగా ఈ నెల 11న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే జన జాతర సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం తాండూర్ లో నిర్వహించే జన జాతర సభలో ఆమె పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తమ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, పలు సభలలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైరన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేయాలని.. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డాడు. చేసిన అభివృద్ధి కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.