ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈసారి కూడా షాక్ తప్పలేదు. సిబిఐ, ఇడి ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కవిత బెయిల్ ధరఖాస్తులను తోసిపుచ్చారు.
సిబిఐ, ఇడి రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పీల్‌ను వ్యతిరేకిస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమె పాత్రపై దర్యాప్తు జరుగుతోందని, ఆమెను బయటకు అనుమతిస్తే ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గతంలోనే ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారని, మొబైల్ డేటాను డిలీట్ చేశారని, సాక్షుల్ని ప్రభావితం చేశారన్న వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు కవితకు బెయిల్ రిజెక్ట్ చేస్తూ తీర్పునిచ్చింది.
ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉంది. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండగా నేడు బెయిల్ పై తీర్పు వెలువడింది. కవితకు అనుకూలంగా బెయిల్ మంజూరవుతుందని ఎదురుచూసిన వారందరికీ నిరాశ తప్పలేదు.
కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా విచారణ హజరయ్యేలా అనుమతివ్వాలని కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా జడ్జి కావేరి బవేజా మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.