రాజస్థాన్‌లోని కోటాలో ఓ విద్యార్థి అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాంపూర్‌లోని బమన్‌శాస్‌కు చెందిన 19 ఏళ్ల రాజేంద్ర మీనా కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌కు (NEET) సిద్ధమవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ క్లాస్‌లకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన అతడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉంటున్న పీజీని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
‘నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నా చదువును కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నా వద్ద రూ.8 వేలు ఉన్నాయి. ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. నా వద్ద ఉన్న సిమ్‌ను కూడా తీసేస్తున్నా. అమ్మకు చెప్పండి నా గురించి చింతించొద్దని. నేను ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోను. అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా కాల్ చేస్తా. ఏడాదికి ఓసారి కచ్చితంగా ఫోన్ చేస్తా’ అని తన తండ్రికి సందేశం పంపించాడు.
కుమారుడి నుంచి వచ్చిన మెసేజ్ చూసిన కుటుంబ సభ్యులు వెంటనే అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగదీశ్ మీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు, అదృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.