ఏప్రిల్ 28న ఆమె తన మిత్రులతో కలిసి ఒక నైట్ పార్టీకి వెళ్లినప్పుడు ఎవరో తన డ్రింక్ లో మత్తు మందు కలిపి.. ఆ తరువాత తను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేశారని ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ఎంపీ బ్రిట్టనీ లౌగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఈ ఘటన తరువాత ఆమె ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయిస్తే.. తన రక్తంలో మత్తు పదార్థాలు ఉన్నట్లు తెలిసిందని.. తాను ఎప్పుడూ మత్తు, లేదా డ్రగ్స్ తీసుకోనని ఆమె తన ఇన్స్ టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో టెస్టులు గురించి తెలిశాక తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. తనతోపాటు నైట్ పార్టీకి వచ్చిన ఇతర మహిళల డ్రింక్స్ లో కూడా ఇలాగే మత్తు పదార్థాలు కలిపినట్లు తెలిసిందని బ్రిట్టనీ వెల్లడించారు.
ఈ ఘటనపై క్వీన్స్ ల్యాండ్ హౌసింగ్ మినిస్టర్ మేగన్ స్కాన్ లాన్ స్పందిస్తూ.. బ్రిట్టనీకి జరిగిన విషయం తెలిసి తాను షాక్ గురయ్యానని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.