పవన్‌ను గెలిపించండి : చిరంజీవి

Published on 


AP: పిఠాపురంలో పోటీచేస్తున్న తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అందుకు సంబంధించిన ఓ విడియో సందేశాన్ని విడుదల చేశాడు.

“అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా వుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ.. కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సాయం చేయడం ఇలా ఎందరికో తను చేసిన సాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పా. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది అన్నాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను.

అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలి. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా అండగా నిలబడతాడు. మీ కోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు…పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి వన్నపం. గాజు గ్లాసు గుర్తుకు ఓటువేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి..జై హింద్ ” అంటూ తన సందేశాన్ని వినిపించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form