TS: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీపై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ అంటోందని రాహుల్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు. దేశంలోని ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ కూడా ఇందులో భాగమే అన్నారు రాహుల్ గాంధీ.
రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము కృషి చేస్తున్నమన్నారు. ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ధనవంతులకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారని చెప్పారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. దేశవ్యాప్తంగా గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పెంచుతామన్నారు. అన్ని రంగాలను మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు.